గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వానికి స్పష్టత లేదు’**భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శ*
*‘గణేశ్ ఉత్సవాలపై ప్రభుత్వానికి స్పష్టత లేదు’*
*భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శ*
*హైదరాబాద్:* తెరాస ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే గణేశ్ ఉత్సవాల నిర్వహణను తప్పుదారి పట్టిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరుపుకొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గణేశ్ ఉత్సవాల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి స్పష్టత లేదని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో పోలీసు అధికారులు తమ ఇష్టానుసారంగా ఉత్సవాల నిర్వహణకు విరుద్ధంగా నిబంధనలు విధిస్తూ ఉత్సవ నిర్వాహకులను బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పాలకులు, అధికారులు హిందూ వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని బండి సంజయ్ దుయ్యబట్టారు.
ధార్మిక సంస్థలు, హిందూ ఉత్సవ సమితులు నిర్ధేశించిన విధానాలకు అనుగుణంగా గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఉత్సవ నిర్వాహకులకు భాజపా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనల పేరిట అధికారులు, పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తే తెరాస ప్రజా ప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తామని ఈ సందర్భంగా బండి సంజయ్ హెచ్చరించారు. కొవిడ్ నిబంధనల సాకుతో తెరాస నేతలు అవలంభిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలు ప్రజలు గమనించాలని సూచించారు. హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుస్తున్న తెరాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను భాజపా దీటుగా ఎదుర్కొంటుందని ఆయన తెలిపారు.
No comments:
Post a Comment