Showing posts with label Chaganti koteswra Rao. Show all posts
Showing posts with label Chaganti koteswra Rao. Show all posts

Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

Srimadhandhra Bhagavatham -- 59 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu



లక్ష్మీదేవి చూపు రాక్షసుల మీద మాత్రం పడలేదు. దానివలన వారికి కీడు ప్రారంభం అయింది. లక్ష్మీదేవిని పొంది శ్రీమన్నారాయణుడు తరించాడు. కన్యాదానం చేసి సముద్రుడు తరించాడు. అమ్మవారి అనుగ్రహమును పొంది ఇంద్రుడు తరించాడు.  ఇంద్రునికి రాజ్యం రాబోతోంది. రాక్షసులకు రాజ్యం చేజారి పోబోతోంది. ఐశ్వర్యం పోయేముందు దెబ్బలాటలు వస్తాయి. అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడూ పరమప్రసన్నంగా మాట్లాడుకోవాలి. తదనంతరము దేవతలు రాక్షసులు కలిసి  పాలసముద్రము  మళ్ళీ చిలకడం ప్రారంభించారు. వారికి అమృతం లభించాలి. అమృతం లభించే వరకు క్షీరసాగర మథనం నడుస్తూ ఉండాలి. చాలాసేపు చిలికిన తరవాత అందులోంచి శ్రీమహావిష్ణువు అంశ కలిగిన వాడు, పచ్చని పట్టు వస్త్రమును ధరించిన వాడు, కంబుకంఠుడు, శంఖ చక్ర గదా పద్మములను ధరించిన మహాపురుషుడు క్షీరసాగర మథనం జరుగుతుండగా ఆ పాల సముద్రంలోంచి ఆవిర్భవించాడు. ఆయనను ధన్వంతరి అని పిలుస్తారు. ఆయన వైద్యశాస్త్రమున కంతటికీ అధిదేవత. ధన్వంతరి అనుగ్రహం కలగడం చేత శరీరములో ఉండే రోగమును గుర్తించి ఆ రోగము నివారణ కావడానికి కావలసిన మందును వైద్యులు నిర్ణయించి ఔషధమును ఇస్తారు. ఆ ఔషధము నందు ధన్వంతరి అనుగ్రహము ప్రకాశించడం చేత మనకు లోపల ఉన్న శారీరకమయిన రోగం నశిస్తుంది. ఆయన యాగమునందు హవిస్సును అనుభవిస్తాడు. ఆయన చేతిలో అమృత పాత్ర ఉన్నది. ధన్వంతరి స్వరూపము శ్రీమహావిష్ణువు స్వరూపమే.
ఇప్పటివరకూ దేవతలు రాక్షసులు క్రమశిక్షణతో చిలుకుతున్నారు. వాళ్ళు దేనికోసం అయితే చిలుకుతున్నారో అటువంటి అమృతపాత్ర వారి ఎదురుగుండా కనపడింది. దేవతలతో కలిసి క్షీరసాగరమును మధించారు కాబట్టి అందులో దేవతలకు కూడా భాగం ఇవ్వవలసి ఉంటుందనే విషయమును రాక్షసులు మరచిపోయారు. ధన్వంతరి చేతిలో ఉన్న అమృత పాత్రను లాక్కుని ఎవరి మటుకు వారు ముందుగా అమృతం తాగేద్దామని ఆ పాత్ర పట్టుకుని సముద్రము ఒడ్డున పరుగులు తీస్తున్నారు. వారిలో వారు బలము కలిగిన వారు ఆ పాత్ర పట్టుకుని పరుగెడుతుండగా వారియందు అమంగళకరమైన కలహం అతిశయించింది. ఐశ్వర్య భ్రష్టత్వమునకు ప్రధాన కారణం కలహం ఏర్పడడం. రాక్షసులు అమృతపాత్రను పట్టుకు పారిపోతుంటే దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. పరమాత్మ మోహినీ రూపమును స్వీకరించాడు. మోహినిని చూసేసరికి రాక్షసులకు స్పృహ తప్పిపోయింది. అమృతపాత్రమీద కోరిక తగ్గింది. తుచ్ఛ కామమునకు జారిపోయారు. వారి కోరిక ఒకటే ‘మనం ఎవరు ఈమెతో బాగా మాట్లాడి ఈమెను వశం చేసుకోగలం’.  శ్రీమహావిష్ణువు కేవల శరీరరూపం చేత రాక్షసులను మోహ పెట్టాడు. వాక్కు చేత సత్యమును చెప్తున్నాడు. ‘మీరు ఏదో పాత్ర పట్టుకు వచ్చి అందులో ఉన్నదానిని పంచమని నన్ను అడుగుతున్నారు. కానీ మిమ్మల్ని చూస్తే నాకు ఒకమాట చెప్పాలని అనిపిస్తోంది. మీకు అర్థం అయితే బాగుపడతారు. చెప్తున్నాను వినండి’ అన్నాడు.
‘తన ధర్మపత్ని యందు అనురాగం ఉండడం ఎప్పుడూ దోషం కాదు. కానీ కనపడిన ప్రతి స్త్రీయందు అర్థములేని ఒక భావన పెంచుకోవడం చాలా ప్రమాదకరం. మీరింతమంది నన్ను ఇలా చూస్తున్నా మీతో మాట్లాడాలని తలంపు కానీ కలిగిందంటే అది మిమ్మల్ని కాల్చే కార్చిచ్చు అవవచ్చు. గుర్తుపెట్టుకోండి. నా తప్పేమీ లేదు’ అని అన్నది. మోహిని మాటలు వాళ్ళ తలకెక్కవు. ఎందుకు అంటే వాళ్ళు కామమునకు వశులై బలహీనమయిన మనస్సు కలవారై మోసపోవడానికి సిద్ధపడ్డారు. ‘మీరు నన్ను పెద్ద చేసి నా చేతిలో అమృతపాత్ర పెడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావని కూడా నన్ను అడగలేదు. ఇపుడు నేను ఈ పాత్రనుపట్టుకుని అంతర్ధానం అయిపోతే మీ బ్రతుకులు ఏమయిపోతాయి? మీరు ఎంతో కష్టపడ్డారు’ అన్నది.
రాక్షసులు నిజంగా ఈమె మాటలలోని యధార్థమును గ్రహించిన వారయితే ‘తల్లీ! మేము ఈ పని చేసి ఉండకుండా ఉండవలసింది’ అని కాళ్ళమీద పడి వెంటనే వాళ్ళ మనసు మార్చుకున్నట్లయితే క్షీరసాగరమథన కథ వేరొకలా ఉంటుంది. చాలామంది క్షీరసాగర మథనంలో శ్రీమన్నారాయణుడు మోసం చేసి రాక్షసులకు అమృతమును పంచి ఇవ్వలేదు అంటారు. అది నిజం కాదు. మోహిని మాటలు విన్న తరువాత కూడా రాక్షసులు ‘అమృతమును నీవే మాకు పంచాలి’ అన్నారు. వారి మాటలు విని మోహిని వారినుంచి అమృత పాత్రను తీసుకుంది. ‘చక్కగా స్నానం చేసి ఆచమనం చేసి రండి. రాక్షసులంతా ఒకవైపు దేవతలంతా ఒకవైపు కూర్చోండి. అమృతమును పోస్తాను’ అన్నది. అలాగే కూర్చున్నారు. ఆమె దేవతలకు అమృతం పోస్తుంటే ఆమె శరీర పృష్ఠ భాగం రాక్షసులకు కనపడుతుంది. వాళ్ళు దానికి తృప్తి పడిపోయేవారు. వీళ్ళల్లో ఎవరికీ అమృతం మీద దృష్టిలేదు. ఆవిడ అంగాంగములమీదే దృష్టి ఉంది. అదే వారి పతనమునకు కారణం. వాళ్ళు అమృతమును పోగొట్టుకుంటున్నారు. తమ మరణమును వారే కొని తెచ్చుకుంటున్నారు. రాక్షసులకు ఉన్న కామ బలహీనత చేత మొత్తము జాతిని గెలిచింది. అప్పటికీ ఇప్పటికీ అంతే. కామమునకు లొంగిపోయే బలహీనతను పెంచుకుంటున్నది కనుక లోకమంతా కామమునకు నశించిపోతోంది. మోహిని దేవతలవైపు పవిత్రంగా కనపడుతుంది. రాక్షసుల వైపు మోహజనకంగా కనపడుతోంది. దీనిని రాహువనే రాక్షసుడు  మోహిని తమను మోసం చేస్తున్నదని గ్రహించాడు. ఆయన వెళ్ళి దేవతలవైపు కూర్చున్నాడు. కానీ ప్రవృత్తి చేత రాక్షసుడు. ఆవిడ రాహువు దగ్గరకు వచ్చింది. రాహువు సూర్యచంద్రుల ప్రక్కన కూర్చున్నాడు. వాళ్ళిద్దరికీ అమృతం పోస్తున్నప్పుడు వాళ్ళు రాహువును సూచిస్తూ ‘ వాడు రాక్షసుడు. వాడికి అమృతం పోయవద్దు’ అని సైగచేశారు. శ్రీమన్నారాయణుడు దీనిని కనిపెట్టాడు. రాహువు రాక్షసుడయినా మోహినీ రూపంలోని శ్రీమహావిష్ణువు అమృతం పోశాడు తప్ప పంక్తినుంచి లేవమని అనలేదు. ఇపుడు రాహువు అమృతము త్రాగాడు. అతడు త్రాగిన అమృతము క్రిందికి దిగిందంటే రాక్షసశరీరము అమృతత్వమును పొందుతుంది. అతనికి రాక్షస ప్రవృత్తి. వెంటనే సుదర్శనమును ప్రయోగించి కుత్తుక కోసేశాడు. పరమాత్మ ఏక కాలమునందు ధర్మాధర్మములను ఆవిష్కరించాడు. అమృతంతో కూడినందు వల్ల తల నిర్జీవం కాలేదు. మొండెం మాత్రం క్రిందపడిపోయింది. పంక్తియందు కూర్చున్న వాడికి అమృతం పోయడం ధర్మం. రాక్షసుడు బ్రతికి ఉంటే ప్రమాదం తెస్తాడు కాబట్టి నిర్జించడం ధర్మం. శిరస్సు అమృతం త్రాగిందని బ్రహ్మగారు నవగ్రహములలో ఒక గ్రహ స్థానమును ఇచ్చి రాహువును అంతరిక్షమునందు నిక్షేపించారు. ఆనాడు కనుసైగ చేసినందుకు గాను రాహువు సూర్య చంద్రులను ఇప్పటికీ గ్రహణ రూపంలో పట్టుకుంటూ ఉంటాడు.
తదనంతరము మోహిని వరుసగా దేవతలకు అమృతం పోసి రాక్షసుల వైపు తిరిగి అమృతం అయిపోయినట్లుగా కుండ తిప్పి చూపించింది. అపుడు రాక్షసులు దేవతలతో యుద్ధం మొదలు పెట్టారు. మోహినీ స్వరూపం అంతర్ధానం అయిపోయింది. ఈవిధంగా దేవతలు అమృతం పొందారు. చాలారోజులు యుద్ధం జరిగింది. అందులో ‘నముచి’ అని ఒకడు బయల్దేరాడు. వాడు దేవేంద్రునితో బ్రహ్మాండమయిన యుద్ధం చేశాడు. దేవేంద్రుడు వాని పరాక్రమం చూసి ఆశ్చర్యపోయి ‘వీడు ఎలా చనిపోతాడు?’ అని అడిగాడు.  ‘వాడు తడిలేని పొడిలేని వస్తువుతో మాత్రమే తాను చనిపోయేలా వరం అడిగాడు. అందుకని వారిని తడి పొడి లేని వస్తువుతో కొట్టు’ అన్నారు.  ఇంద్రుడు తన వజ్రాయుధమును సముద్రపు నురుగులోకి తీసుకు వెళ్ళి అటూ ఇటూ తిప్పాడు. నురుగు తడి పదార్ధం కాదు పొడి పదార్ధం కాదు. అలా ప్రయోగించేసరికి నముచి చచ్చిపోయాడు. దీనిని ఒక కథగా కాకుండా అంతకు మించి ఇందులో తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. కష్టం వచ్చినపుడు దేవతలు శ్రీమన్నారాయణుని ప్రార్థన చేశారు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈశ్వరుని ప్రార్థన చేయడం అనేది ఈ జాతి సొత్తు. క్షీరసాగరము అనేది ఒక పాలకుండ. అది మన హృదయమందే ఉన్నది. ఈశ్వరుడు ఇక్కడే ఉన్నాడు.  పాలకుండను విడిచిపెట్టి  లోకము చుట్టూ తిరుగడము చేత అశాంతి ఉన్నది.  ఏది శాంతిని ఇస్తుందో దానిని పట్టుకుంటే శాంతిని ఇస్తుంది. మనస్సు శాంతిగా ఉండాలంటే శాంతికరమైన పదార్ధమును  పట్టుకోవాలి. మనలో ఉన్నది పట్టుకోవడం బయట తిరగడం వలన సాధ్యం కాదు. బయటకు వెళ్ళడం కాదు. లోపలికి వెళ్ళాలి. మనకెప్పుడూ బయటకు వెళ్ళడమే తెలుసు కానీ లోపలికి వెళ్ళడం తెలియదు.   లోపలికి వెళ్ళడానికి అసలు ప్రయత్నం చేయలేదు. అలా ప్రయత్నం చేయడమే క్షీరసాగర మథనం. పాలసముద్రంలో మంధర పర్వతమును దింపడం అంటే ధ్యానంలో మన మనస్సును తీసుకు వెళ్ళి స్వామి దగ్గర పెట్టడం అన్నమాట. ధ్యానమునందు నిష్ఠ కుదరడానికి చాలా ప్రయత్నం చేయాలి. లేకపోతే మనస్సు మంధర పర్వతం ఊగినట్లే ఊగుతుంది.  కంగారుపడిపోకూడదు. మళ్ళీ దానిని వెనకకి తీసుకురావాలి. స్వామీ! నా ధ్యానము బాగా కుదిరేటట్లు చూడని  ప్రార్థన చేయాలి.  తొట్రుపడితే భగవంతుడినే ప్రార్థించారు.  ఆయన ఆదికూర్మమయ్యాడు. ఆయనే ఆధారం అయాడు. అలాగే ధ్యానంలో చెదిరిన నీ మనస్సును కుదర్చడానికి స్వామి ఏదో రూపంలో సహాయం చేస్తాడు. ఇదే మంధర పర్వతమును దింపి క్షీర సాగరమథనం చేయడము. అలా ధ్యానం చేయగా చేయగా ముందు ప్రశాంతత కలుగుతుంది.

Health care

  Human health may be affected by a number of factors, including exposure to physical, chemical, biological, and radiological contaminants i...